విజయవాడ: దివంగత మహానేత వైఎస్సార్ పాలన స్ఫూర్తితో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల శాఖ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం 'వేదిక' మాసపత్రిక ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్.. ప్రజల కష్టాలను కళ్లారా చూడటంతో పాటు, స్వయంగా తెలుసుకున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేయడమే ధ్యేయంగా పాలన చేస్తున్నారని వెల్లడించారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిజమైన ప్రజా ప్రభుత్వం అనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. 'వైఎస్ జగన్‌కు ఎత్తులు, పై ఎత్తులు తెలియవని.. పేదల అవసరాలు తీర్చడమే ఆయనకు తెలుసునని' పేర్కొన్నారు.
అణగారిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో సినిమా నటులు ఎవరితో పొత్తు పెట్టుకుని వచ్చినా.. ప్రజలు మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకం ఉంచారన్నారు. ప్రజలతో మమేకమయ్యే సినీ నటులు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని, లేకపోతే ప్రజలకు వారి అవసరం లేదన్నారు. సీఎం జగన్ నిజాయితీగా తను ప్రజా సేవ చేస్తూ.. మిగతా వారిని పరుగులు పెట్టించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆరు నెలల ముందు.. తర్వాత పాలనకు తేడా ప్రతిఒక్కరికి స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో వేదిక మాసపత్రిక విశ్లేషణాత్మకంగా ప్రజా పత్రిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేరుగ నాగార్జున, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు.