కనికా నిర్లక్ష్యంతో పార్లమెంటులో కలకలం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్‌ గాయని కనికాకపూర్‌ నిర్లక్ష్యంతో కరోనా భయాందోళనలు తాజాగా పార్లమెంటు దాకా  పాకాయి.  కనికా కపూర్‌  తనకు  కరోనా పాజిటివ్‌ అని తేలిందని, దీంతో తన కుటుంబం మొత్తం సెల్ప్‌ నిర్బంధంలోకి పోతున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో కరోనా తుట్టె కదిలింది.  పలువురు ఎంపీలు సహా,  కరోనాతో కలిసిన, సన్నిహిత  మెలిగిన వారంతా  స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోవాల్సిన  పరిస్థితి  ఏర్పడింది. 




వివరాలను పరిశీలిస్తే.. కనికాకపూర్‌ ఏర్పాటుచేసిన పార్టీకి రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్‌ సింగ్‌, ఆయన సన్నిహిత బంధువులు హజరయ్యారు. దీంతో కనికాకపూర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుసుకున్నఎంపీ దుష్యంత్‌ సింగ్‌ సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌ విధించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.   మరోవైపు  ఇంటికే పరిమితమైనట్టు ఆయన తల్లి వసుంధరా రాజే కూడా ప్రకటించారు.